- వారంలోగా గైడ్ లైన్స్ ఖరారు
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గిగ్ వర్కర్ల రక్షణకు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. ట్రాన్స్ పోర్ట్, ఫుడ్ డెలివరీ, ప్యాకేజ్ డెలివరీల్లో పనిచేసే వర్కర్లకు ఉద్యోగ భద్రత, సాలరీ, యాక్సిడెంటల్ బీమా, గ్రీవెన్స్ సెల్, ఫిర్యాదులు వాటి పరిష్కారం, సామాజిక భద్రత, కంపెనీల వేధింపులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి.
కార్మికులు 8 నుంచి 12 గంటలు పనిచేస్తున్నా.. కంపెనీల నుంచి వేధింపులు, శారీరక శ్రమ, అభద్రతా భావం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ పోషణ భారంగా మారుతున్నాయని.టార్గెట్లు, ఇన్ టైమ్లో డెలీవరీ చేయడం, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు సర్వేల్లో వెల్లడైంది. వీటి పరిష్కారానికి పాలసీ రూపొందిచడానికి గైడ్ లైన్స్ ఖరారుపై కార్మిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
త్వరలో స్విగ్గి, జొమాటో, ఉబర్, ఓలా తదితర కంపెనీలతో పాటు కార్మిక యూనియన్లు, ఎన్జీవోలు, మేధావులతో అధికారులు సమావేశమై సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు పాలసీలో ఉండే అంశాలను కంపెనీల ప్రతినిధులకు తెలపనున్నారు. వారంలోగా గైడ్ లైన్స్ ఖరారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి, సీఎస్ శాంతికుమారికి అందజేస్తామని చెప్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పాలసీని ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.